డా. గోపాలకృష్ణయ్య - 22....           06-Nov-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 22

అలుపు లేని  గెలుపు కోసం

          మాలెంపాటి గోపాల కృష్ణయ్యని. 85 ఏళ్ల క్రిందట కృష్ణాతీర నిమ్మగడ్డలో పుట్టాను, చల్లపల్లి SRYSP. విద్యాసంస్థలో చదివాను, ఎలాగొలా డాక్టరు అనిపించుకొన్నాను. చిక్కటి వామపక్ష వాతావరణంలో సగం జీవితం గడిపాను. సదరు పార్టీల  చింత చెట్లు క్షీణిస్తున్నా ఆ పులుపు నాలో చావడం లేదు.

          మా ఇద్దరు పిల్లల పిల్లలకోసం పుష్కర కాలం అమెరికాలో జీవించాను. పెద్ద కూతురు వత్తిడి చేస్తే చెన్నైలో అప్పుడప్పుడు ఉంటున్నాను. బ్రతుకు మలి సంధ్యలో దశాబ్దానికి పైగా నేనుంటున్న చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమంలో భాగస్వామినయ్యాను.

          ఇదుగో - ఇక్కడే వస్తున్నది చిక్కు. "నీ వయసేమిటీ- నీ గుండెకూ కాళ్లకూ మల్టిపుల్ ఆపరేషన్లు జరిగి, నీకూ, నీ  శ్రీమతికి నిత్యం అనారోగ్య సమస్యలేమిటీ – వేకువ 3 ½ కు లేచి,  శ్రమదాన వేషాలేమిటీ ... " అని మా పిల్లలూ, సగంమంది స్వచ్ఛ కార్యకర్తలూ చనువుగా మందలిస్తుంటారు.

          “ఏదోలే- తిట్టేనోరూ, తిరిగే కాలూ ఊరుకోవులే” అని సరిపెట్టు కొంటారు. కొన్నిసార్లు మాని చూశాను. అబ్బే- నావల్ల కాలేదు. నా ఊరి బాగు కోసం మిత్రులూ, కుర్రాళ్లూ రోజూ గంటన్నర – 2 గంటలు చెమటోడుస్తుంటే- బెజవాడ నుంచి మకాం మార్చి ఒక శాస్త్రి చల్లపల్లి వచ్చి బ్రతుకుతుంటే- ఇద్దరు డాక్టర్లు తమ సంపాదనా సర్వస్వాన్ని, శక్తియుక్తుల్ని అవలీలగా ధార పోస్తుంటే- అరె ! ఇందరు ఆడపిల్లలు  రోడ్లెక్కి నా ఊరికోసం నానా చాకిరీ చేస్తుంటే –

          నేనూ వాళ్లతో చేరక నాలుగు గోడల మధ్య ఎట్లా ఉండిపోగలనో మీరే  చెప్పండి! ఈ కుర్రాళ్ల పని పాటులు చూడకుండా-  వాళ్ళకు  మంచి తీర్థమందించకుండ - తృణమో పణమో చందా ఇవ్వకుండా – మిత్రుడు శంకర శాస్త్రి తో కలిసి  తినుబండారాలందించకుండ ఇంట్లో పడుకొని చప్పగా బతకాలా?

          నా ఊరికీ నాకూ ఈ శ్రమదాన మనేదొక మలుపు. సాధించక తప్పదు అందులో గెలుపు.  అప్పటి దాకా మన కుండ రాదు అలుపు.

          స్వచ్చ సుందరోద్యమ దశమ  వార్షికోత్సవ  శుభాకాంక్షలతో

- డా. గోపాలకృష్ణయ్య.

   03.11.2024