(అన్నపూర్ణా సమేత) పల్నాటి భాస్కర్! -24 ....           08-Nov-2024

దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 24

55 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో:

- నేనే ఇన్ని మిట్టపల్లాలు చూశాను, కష్టనష్టాలు ఎదుర్కొన్నాను, హెల్త్ డిపార్ట్ మెంటులో కొలువు కోసం ఎన్నెన్ని ఊళ్లో మారాను.  అలాంటిది - ఈ చల్లపల్లి తన వేల సంవత్సరాల బ్రతుకుబాటలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నదో – తననుతాను సరిజేసుకొన్నదో గదా!

         ఈ ఊరు రాజుల్నీ, వాళ్ల వ్యతిరేక ఉద్యమాల్ని, ప్రజాస్వామ్యాన్ని, అందులో పిచ్చి పరిపాలనల్ని.... ఎన్నైనా చూసుండవచ్చు గానీ.

         మీ ఈ పది-పదకొండేళ్ల స్వచ్ఛ-సుందర ఉద్యమాన్నీ, ఊరి కోసం ప్రతి వేకువా 30-40-50 మంది శ్రమదాన గాంధీ గిరిని ఎప్పుడైనా చూసిందా?

         భార్యల్ని ప్రోత్సహించి వీధి శ్రమకు పంపే మగాళ్ళూ, భర్తలకి నచ్చజెప్పి, ఊరి మంచి కోసం ఉదయం 4.00 కే వీధుల్లోకి తీసుకొచ్చే మహిళలూ, ఒక పోటీతత్త్వంతో, సమన్వయంతో, సందర్భోచితమైన సహనంతో ప్రతి మురికి కంపు పనినీ చేసుకుపోయే త్యాగమూర్తులైన కార్యకర్తల సమూహం ఇక్కడ తప్ప ఏ ఊళ్ళో కనిపిస్తుందో చెప్పండి!

         ఇక నా శ్రమదానం గురించా - పెద్దగా చెప్పేదేముంది? ఈ 3290 రోజుల్లో సగం రోజులైనా వచ్చానో లేదో! మిగిలిన కార్యకర్తల్తో పోలిస్తే – మరీ కఠినమైన, బరువు పనులు పెద్దగా చేశాననీ చెప్పలేను!

         ఇందులో 90% హాజరున్న కార్యకర్తలున్నారు, పొరుగూళ్ళ నుండి అంత చీకటితో – అదేదో దైవదర్శనానికి వచ్చినట్లు - ఈ చల్లపల్లి ఒక దేవుడన్నట్లు – వచ్చి, శ్రమ కైంకర్యం చేసిపోయే వాళ్ళున్నారు!

         ఎక్కడిదాకో ఎందుకు - నాయింట్లోనే నా శ్రీమతే - ఒక్కోరోజు అర్ధరాత్రి లేచి, కార్యకర్తల కేవేవో వండి, వార్చి వేకువనే పట్టుకెళ్ళి తినిపిస్తుంది! కాలు దెబ్బతిని కూడా అక్కడ కూర్చునైనా పని చేస్తూనే ఉంటుంది. మాపిల్లలు సైతం ఈ శ్రమదానంలో వ్రేలు పెట్టిన వాళ్లే!

         అందుకని- ఈ పదేళ్ళ అద్భుత గ్రామ సామాజిక శ్రమదానానికి శత  సహస్ర వందనాలు! దీని నిర్వాహకులకు ధన్యవాదాలు! ఇంకో పదేళ్లు పట్టినా సరే - నా చల్లపల్లి ఇంకా ఇంకా మెరుగు పడితే చాలు!

- (అన్నపూర్ణా సమేత)

  పల్నాటి భాస్కర్!

  06.11.2024.