దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 25, 26
ఒక ఉత్తేజం - ఇక ఉత్సాహం - ఒక ఆదర్శం!
నాది “స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని మనసులో అనుకొంటేనే - కారణాంతరాల వల్ల వచ్చిన దిగులో - డిప్రషనో కొంత తగ్గుతుంది! నా గ్రామం మేలు కోసం ప్రతి వేకువా కష్టడుతున్న స్వచ్ఛ కార్యకర్తల గుంపులో చేరానంటే చాలు - కొత్త ఉత్సాహం వస్తుంది! ఒంటరి భావన మాయమౌతుంది!
బహుశా – మంచి మనసులున్న చాల మంది కలయిక వల్ల కావచ్చు - చేసేది స్వార్ధ రహిత సత్కార్యం వల్లనూ కావచ్చు!
“ఇందరు మహిళలూ-పెద్దలూ-మాన్యులూ – సామాన్యూలూ ఎందుకింతగా శ్రమదానానికంకితులైపోయారా” అని ఆలోచిస్తే- వాళ్ళలో బీజప్రాయంగా ఉన్న సేవానిరతిని ఒక మంచి వైద్యుడు కాస్త కదిలించడం వల్ల కావచ్చు –
మా వరకు - గురిందపల్లి ఇందిరా, తూము వేంకటేశ్వరావులనే మేము మాత్రం ఈ ఇద్దరు డాక్టర్ల మూలంగానే శ్రమదానానికలవాటు పడ్డాం! ఒకళ్లం వాళ్ళ ఆస్పత్రి నర్సు కావడమూ - మరొకళ్లం ఘంటశాల లో రెవిన్యూ ఇన్స్పెక్టరుగా ఉండటమూ!
మాలో రెండోవారికెంతగా ఈ వ్యసనం పట్టుకొన్నదంటే - యార్లగడ్డలో ఉద్యోగిస్తూ - అక్కడ 10-12 మందిని కూడా గట్టి – చల్లపల్లికి నకలు లాగే సహస్రాధికఉదయ సాయంత్రాలు ఊరిని బాగు చేసి - 4500 మొక్కలు నాటేంత దాకా!
ప్రమోషన్ మీద బందరు కలెక్టరాఫీసుకు వెళ్లినా - ఈ స్వచ్ఛ - సుందరోద్యమ వాసనలు వదలక - అక్కడా ఈ మంచి పనులు కొన్ని చేశాను!
ఈ మధ్య కాలమైతే మాలో మొదటివారే నైట్ డ్యూటీలున్నప్పడల్లా ఊరి బాధ్యతలు నెరవేరుస్తున్నారు!
ఉడతా భక్తిగా అప్పుడప్పుడూ మన మంచి ట్రస్టుకు కాస్తోకూస్తో ఆర్థిక సహకారమందిస్తున్నాం కూడా!
ఇవన్నీ బలవంతంగానో - మాయజేసో చేయించగల పనులా? ఎప్పటికైనా ఆదర్శప్రాయమైన ఈ శ్రమదానాద్యమం ఆగరాదనడానికే మా ఇద్దరి ఓటు!
- గురిందపల్లి ఇందిర,
తూము వేంకటేశ్వరరావు.
13.11.2024.