09.09.2023 ....           09-Sep-2023

   దృష్టిని బట్టే కనిపిస్తుంది...

॥ దృష్టిని బట్టే కనిపిస్తుందీ స్పష్టని విన్నాను

నువ్వది వేదం అన్నావు - నేనది వాదం అన్నాను ॥

సంత మధ్యలో జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే

నువ్వది గేయం అన్నావు - నేనది గాయం అన్నాను

                              ॥ దృష్టిని బట్టే ॥

కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే

నువ్వది వినోదమన్నావు - నేనది ప్రమాదమన్నాను

                             ॥ దృష్టిని బట్టే ॥

ఊరి మెరుగుదల కోసం కొందరు ఉద్యమించుచుంటే

నీవు నిరర్థకమంటావు - నేనది సార్థక మంటాను

                             ॥ దృష్టిని బట్టే ॥

శ్రమదానం మన చల్లపల్లి కొక వర దానం అంటే

నువ్వది మోటు పనంటావు – నేనది నీటు పనంటాను

                                  ॥ దృష్టిని బట్టే ॥

తొమ్మిదేళ్ళుగా స్వచ్చ సైనికుల చెమట చిందుతుంటే

నువ్వది విచిత్రమంటావు – నేనది పవిత్రమంటాను  

                                      ॥ దృష్టిని బట్టే ॥

ప్రజారోగ్య పరిరక్షణ కోసం పాటు పడుతు ఉంటె

నువ్వది కీర్తి దురద అంటే – నేనది బాధ్యత అంటాను

                                      ॥ దృష్టిని బట్టే ॥

 

డ్రైను లోన దిగి కార్యకర్తలు బురద తోడుతుంటే

నువు ముక్కులు మూసి నిష్క్రమిస్తే – మేము నిలిచి సహకరిస్తాం

                                                          ॥ దృష్టిని బట్టే ॥

శ్మశానాల క్రమబద్దీకరణకు శ్రమకు పూనుకొంటే

భయపడి వెనకడుగేస్తావు – మేం నిలబడి పురోగమిస్తాము

                                      ॥ దృష్టిని బట్టే ॥